రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఎరువుల ధరలు

  • బ్రెజిల్ లో 34 శాతం ఎగబాకిన పొటాష్ ధర
  • అమెరికాలో 22 శాతం పెరిగిన యూరియా రేటు 
  • 16% ఎగబాకిన నార్త్ అమెరికన్ ఫెర్టిలైజర్ ఇండెక్స్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ ఎరువులపై పడింది. ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు పెరిగిపోయాయి. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, అక్కడి నుంచి ఎరువుల సరఫరా ఆగిపోవడంతో ప్రపంచ మార్కెట్లలో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో పాటు ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం తీవ్రమైంది. ద గ్రీన్ మార్కెట్స్ నార్త్ అమెరికన్ ఫెర్టిలైజర్ సూచీ ఒకే సారి 16 శాతం రికార్డ్ స్థాయికి ఎగబాకింది. న్యూ ఓర్లాన్స్ లో యూరియా ధర 22 శాతం పెరిగింది. బ్రెజిల్ లో పొటాష్ ధర 34 శాతం ఎగబాకింది.  

సాధారణంగా వివిధ దేశాలకు రష్యా అతి తక్కువ ధరకు ఎరువులను సరఫరా చేస్తుంటుంది. ఆంక్షల నడుమన ఎగుమతులను ఆపేయాలని, దేశ అవసరాలకు మాత్రమే నిల్వలను ఉంచాలని రష్యా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూరప్ దేశాలతో పాటు అన్ని దేశాలకు ఎగుమతులు ఆగాయి. ఎరువుల ధరలతో పాటు ఆహార ధాన్యాల ధరలూ భారీగా పెరుగుతున్నాయి. గోధుమలు, మొక్కజొన్న, జొన్నలు, తృణ ధాన్యాల ధరలు ఎక్కువయ్యాయి. 

ఈ నేపథ్యంలోనే ఆంక్షల జాబితా నుంచి పంట పోషకాలను తొలగించాలని బ్రెజిల్ భావిస్తోంది. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ మీటింగ్ లో ఇదే విషయాన్ని చెప్పాలని యోచిస్తోంది. దానికి అర్జెంటీనాతో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాల మద్దతును కోరుతోంది. 

వాస్తవానికి బ్రెజిల్ ఎరువుల విషయంలో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ సింహభాగం రష్యా నుంచే వస్తుంది. నత్రజని, పొటాష్ దిగుమతులు 90 శాతం రష్యా నుంచే వస్తాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించాలని, 2050 నాటికి దిగుమతులను 45 శాతం తగ్గించుకోవాలని భావిస్తోంది.


More Telugu News