భారత్ రాఫెల్ కు పోటీగా... చైనా నుంచి జే-10సీ యుద్ధ విమానాలను అందుకున్న పాకిస్థాన్

  • ఫ్రాన్స్ నుంచి భారత్ కు రాఫెల్ విమానాలు
  • చైనాతో పాకిస్థాన్ ఒప్పందం
  • పాక్ వాయుసేనలో చేరిన జే-10సీ విమానాలు
  • 4.5వ తరం యుద్ధ విమానాలుగా గుర్తింపు
ఫ్రాన్స్ నుంచి భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను పొందిన నేపథ్యంలో, పాకిస్థాన్ తన మిత్రదేశం చైనా నుంచి జే-10సీ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఈ మల్టీ రోల్ జెట్ ఫైటర్లను నేడు పాక్ వాయుసేనలో ప్రవేశపెట్టారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన మిన్హాస్ కమ్రా ఎయిర్ బేస్ లో ఈ మేరకు ఓ కార్యక్రమం జరిగింది. 

భారత్... ఇటీవల ఫ్రాన్స్ నుంచి విడతల వారీగా రాఫెల్ యుద్ధ విమానాలను అందుకుంది. రాఫెల్ రాకతో పాకిస్థాన్ పై భారత్ కు స్పష్టమైన గగనతల ఆధిక్యం ఏర్పడింది. ఆ లోటును పూడ్చుకోవడానికి పాక్... చైనాపై ఆధారపడింది. 

జే-10సీ యుద్ధ విమానాల రాకను పురస్కరించుకుని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఇదొక అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలను ఇచ్చిన 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అత్యాధునిక యుద్ధ విమానాలు పాక్ వాయుసేనలో చేరుతున్నాయని వివరించారు. కొన్నిసార్లు ఆధునిక యుద్ధ విమానాలను పొందేందుకు సంవత్సరాల సమయం పడుతుందని, కానీ చైనా కేవలం 8 నెలల వ్యవధిలోనే యుద్ధ విమానాలను సరఫరా చేసిందని ఇమ్రాన్ ఖాన్ కొనియాడారు. ఈ సందర్భంగా చైనాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. 

చైనా అభివృద్ధి చేసిన జే-10సీ యుద్ధ విమానంలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (ఏఈఎస్ఏ) రాడార్ వ్యవస్థను పొందుపరిచారు. ఈ విమానం అప్ గ్రేడ్ చేసిన నాలుగో తరం (4.5 జెనరేషన్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లను కలిగి ఉంటుంది. అంతేకాదు, షార్ట్ రేంజ్ పీఎల్-10 క్షిపణులతో పాటు బియాండ్ విజువల్ రేంజ్ పీఎల్-15 క్షిపణులు కూడా దీంట్లో ఉన్నాయి. 

జే-10సీ యుద్ధ విమానం 4.5వ తరం ఫైటర్ జెట్. ఇది చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 కంటే చాలా శక్తిమంతమైన యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానాలను  ఈ నెల 23న ప్రదర్శించేందుకు పాకిస్థాన్ ఏర్పాట్లు చేస్తోంది.


More Telugu News