నా కోసం గోతులు త‌వ్వి.. వాటిలో వారే ప‌డిపోయారు: పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ

  • సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవితో కాంగ్రెస్‌లో అల‌జ‌డి
  • సీఎం ప‌ద‌విని వ‌దిలేసిన అమ‌రీంద‌ర్‌
  • ఆపై పార్టీని వీడి కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌
  • విధి లేని ప‌రిస్థితుల్లో చ‌న్నీకి సీఎం ప‌ద‌వి
  • చ‌న్నీతోనూ స‌ర్దుకోలేక‌పోయిన సిద్ధూ 
గురువారంతో ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు బీజేపీ, ఆప్‌ల‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింప‌గా.. ఘోర ప‌రాజ‌యం పాలైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను మ‌రింత నిరాశ‌లో ముంచేశాయి. గ్రూపు త‌గాదాల‌కు పుట్టినిల్లుగా మారిన కాంగ్రెస్‌ను ఆ ముఠా క‌క్ష‌లే ముంచేశాయని చెప్ప‌క త‌ప్పుదు. ఇందుకు పంజాబ్ ఎన్నిక‌ల ఫ‌లితాలే సాక్ష్య‌మ‌న్న వాదన‌లూ వినిపిస్తున్నాయి. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

చాలా కాలం క్రిత‌మే సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే ఎన్నిక‌ల‌కు కొన్నినెలల ముందుగా ఆయ‌న‌కు ఏకంగా పీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన అధిష్ఠానం తీరును నిర‌సిస్తూ అప్ప‌టిదాకా సీఎంగా కొన‌సాగిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని అధిష్ఠానం సీఎంగా కూర్చోబెట్టింది. మొత్తంగా స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత మేర అల‌జ‌డి రేగింది. సీఎం కుర్చీ ఎక్కుదామ‌ని భావించిన సిద్ధూను అమ‌రీంద‌ర్ అడ్డుకున్నారు. చ‌న్నీని కూడా త‌న కంట్రోల్‌లోకి తీసుకోవాల‌ని య‌త్నించిన సిద్ధూ విఫ‌ల‌మ‌య్యారు.

ఈ కుమ్ములాట‌ల ఫ‌లితంగానే అటు అమ‌రీంద‌ర్‌, చ‌న్నీతో పాటు ఇటు సిద్ధూ కూడా ఓట‌మిపాల‌య్యారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై తాజాగా స్పందించిన సిద్ధూ.. త‌న కోసం గోతులు తవ్విన వారు.. వారు తీసిన గోతుల్లోనే ప‌ది అడుగుల లోతులో ప‌డిపోయారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, పార్టీకి ఘోర ప‌రాభ‌వం ద‌క్కిన స‌మ‌యంలో ఇంకా కుమ్ములాట‌ల గురించే మాట్లాడ‌టం భావ్య‌మా? అంటూ పార్టీ శ్రేణులు సిద్ధూ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.


More Telugu News