వికటించిన మధ్యాహ్న భోజనం.. నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత

  • నంద్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం
  • విద్యార్థులకు వడ్డించిన పాడైపోయిన గుడ్లు
  • ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 92 మంది విద్యార్థులు భోజనం చేశారు. వెంటనే వారిలో పలువురు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి, విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాడైన గుడ్లను వడ్డించడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరోవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని... మధ్యాహ్న భోజనంలో గుడ్డు, సాంబారు తిన్నారని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.


More Telugu News