ఉక్రెయిన్ పై పోరుకు వలంటీర్లు... పుతిన్ కొత్త పంథా

  • రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం
  • మధ్యప్రాచ్యం నుంచి ఫైటర్లు వస్తారన్న రక్షణమంత్రి షొయిగు
  • వారికి ఆయుధాలు కూడా అందించాలన్న పుతిన్
  • జావెలిన్, స్టింగర్ మిస్సైళ్లు అందిస్తామన్న షొయిగు
ఉక్రెయిన్ లో 16 రోజులుగా సైనిక చర్య కొనసాగుతున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంథా మార్చినట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్ దళాలపై పోరాటానికి వలంటీర్లను పంపించాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ భూభాగాలను తేలిగ్గా స్వాధీనం చేసుకోవచ్చని భావించిన రష్యాకు భారీగా నష్టం వాటిల్లినట్టు కథనాలు వస్తున్నాయి. వేలమంది రష్యా సైనికులను హతమార్చామని, పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను, రష్యా విమానాలు, హెలికాప్టర్లను కూల్చామని ఉక్రెయిన్ చెబుతోంది. 

ఈ నేపథ్యంలో, మధ్యప్రాచ్యం నుంచి వేల సంఖ్యలో ఫైటర్లను రంగంలో దింపాలన్న ప్రతిపాదనకు పుతిన్ తాజాగా ఆమోదం తెలిపారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో రక్షణ మంత్రి సెర్గీ షొయిగు మాట్లాడుతూ, రష్యా అనుకూల దళాలతో కలిసి డాన్ బాస్ ప్రాంతంలో పోరాడేందుకు మధ్యప్రాచ్యం నుంచి 16,000 మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వారు ఎలాంటి ప్రతిఫలం కోరడంలేదని, డాన్ బాస్ ప్రజల తరఫున పోరాడేందుకు వస్తున్నారని షొయిగు వివరించారు. 

అంతేకాదు, ఉక్రెయిన్ దళాల నుంచి స్వాధీనం చేసుకున్న జావెలిన్, స్టింగర్ మిస్సైళ్లను డాన్ బాస్ సాయుధ దళాలకు అందజేస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు కూడా పుతిన్ సానుకూలంగా స్పందించారు. లుగాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాల్లో పోరాడుతున్న దళాలకు కూడా వాటిని అందజేయాలని పుతిన్... రక్షణ మంత్రి షొయిగుకు సూచించారు.


More Telugu News