ప్రజల తీర్పే పరమావధి.. రైతుల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి: బీకేయూ నేత టికాయత్
- సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన బీకేయూ
- ఎన్నికైన ప్రభుత్వాలకు శుభాకాంక్షలన్న టికాయత్
- రైతుల ఉద్యమం తన ప్రభావం చూపించిందని వ్యాఖ్య
ప్రజల తీర్పు శిరోధార్యమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ అంగీకరించారు. ఐదు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు రైతుల కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర సర్కారు రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో, యూపీ, పంజాబ్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం తెలిసిందే.
రైతు సంఘాలు 13 నెలలు అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. రైతులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయినందుకు క్షమాపణ కూడా చెప్పారు. దీంతో సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళలను విరమించుకుంది. కనీస మద్దతు ధర డిమాండ్ ను కూడా నెరవేర్చాలంటూ కేంద్రానికి అల్టిమేటం కూడా ఇచ్చింది.
రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చాలో బీకేయూ కూడా భాగంగా ఉంది. యూపీలో బీజేపీని శిక్షించాలంటూ ప్రచారాన్ని సైతం సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించడం గమనార్హం. ఇంత జరిగినా నాలుగు రాష్ట్రాల్లో రైతులు బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ప్రజల తీర్పే అంతిమమంటూ టికాయత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘ప్రజాస్వామ్యానికి చెందిన గొప్ప పండుగలో ప్రజలు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. రైతుల ఉద్యమం తన ప్రభావాన్ని చూపించింది. అన్ని ప్రభుత్వాలు రైతులు, కార్మికుల ఉన్నతి కోసం పనిచేయాలని ఆశిస్తున్నాం" అన్నారాయన.