బీజేపీ సీట్లను కూడా తగ్గించవచ్చనే విషయాన్ని నిరూపించాం: అఖిలేశ్ యాదవ్

  • సమాజ్ వాదీ పార్టీ సీట్లను రెండున్నర రెట్లు పెంచిన యూపీ ప్రజలకు ధన్యవాదాలు
  • బీజేపీ సీట్లను తగ్గించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది
  • రాబోయే రోజుల్లో బీజేపీపై భ్రమలు మొత్తం తొలగిపోతాయన్న అఖిలేశ్ 
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 403 స్థానాలకు గాను 273 స్థానాల్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి జయకేతనం ఎగురవేసింది. సమాజ్ వాదీ పార్టీ 125 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 49 స్థానాలను కోల్పోగా... సమాజ్ వాదీ పార్టీ 73 అధిక స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 2 స్థానాలకు, మాయావతి పార్టీ బీఎస్పీ 1 స్థానానికి మాత్రమే పరిమితమై అడ్రస్ లేకుండా పోయాయి. 

ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'సమాజ్ వాదీ పార్టీ సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని ఒకటిన్నర రెట్లు పెంచినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. బీజేపీ సీట్లను తగ్గించవచ్చనే విషయాన్ని నిరూపించాం. బీజేపీ సీట్లను తగ్గించే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. బీజేపీపై ఉన్న భ్రమలు సగానికి పైగా తొలగిపోయాయి. రాబోయే రోజుల్లో మొత్తం భ్రమలు తొలగిపోతాయి. ప్రజా ప్రయోజనాల కోసం జరిగే పోరాటమే చివరకు గెలుస్తుంది' అని అన్నారు.


More Telugu News