చిరంజీవి కొత్త సినిమాల మాదిరే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఉంది: వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  • ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి
  • ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి
  • పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారన్న ఎమ్మెల్యే 
వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని ఆ పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. 

చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని... అదే విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు వచ్చి చూడాలని కోరుతున్నానని అన్నారు.


More Telugu News