కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం: యోగి ఆదిత్యనాథ్

  • యూపీలో కాషాయ జెండా రెపరెపలు
  • మరోసారి పీఠం ఎక్కనున్న యోగి ఆదిత్యనాథ్
  • మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా
  • లక్నోలో బీజేపీ శ్రేణుల సంబరాలు
యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. 403 అసెంబ్లీ స్థానాలకు గాను 275 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టనున్న తొలి సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఇప్పటివరకు అక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది లేదు. యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసి ఘనవిజయం అందుకున్నారు. 

ఈ నేపథ్యంలో, ఫలితాల సరళిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారన్న దానికి ఈ ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాలన చూసి ప్రజలు ఓట్లేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడే అధికారం సాధ్యమని ఉద్ఘాటించారు. మోదీ నాయకత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో జయభేరి మోగించిందని యోగి అన్నారు.  

యూపీలో తొలిసారిగా ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. బీజేపీ పాలనలో సురక్షితంగా ఉంటామని ప్రజలు విశ్వసిస్తున్నారని, మోదీ మార్గదర్శనంలో మరిన్ని ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళతామని యోగి చెప్పారు. కాగా, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లక్నోలో బీజేపీ శ్రేణులు భారీగా సంబరాలకు తెరదీశాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


More Telugu News