గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ

  • 20 సీట్ల‌తో అతిపెద్ద పార్టీగా బీజేపీ
  • 12 సీట్ల‌కే ప‌రిమిత‌మైన కాంగ్రెస్‌
  • చెరో 2 సీట్ల‌తో స‌రిపెట్టుకున్న ఆప్‌, తృణ‌మూల్‌
  • ఏకంగా న‌లుగురు స్వ‌తంత్ర అభ్య‌ర్థుల విక్ట‌రీ
గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఫ‌లితాల అనంత‌రం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. స్పష్టమైన మెజారిటీకి అడుగు దూరంలోకి వ‌చ్చి ఆగిపోయింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే మ‌ద్ద‌తు ద‌క్కితే గోవాలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ట్టే. ఆ దిశ‌గానే ఆ పార్టీ నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

మొత్తం 40 సీట్లు క‌లిగిన గోవా అసెంబ్లీలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌లువురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా బ‌రిలోకి దిగారు. గురువారం ఉద‌యం మొద‌లైన ఓట్ల లెక్కింపులో తొలుత కాంగ్రెస్‌కే ఆధిక్యం క‌నిపించినా.. ఆ త‌ర్వాత బీజేపీ పుంజుకుంది.

ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేస‌రికి బీజేపీ ఏకంగా 20 సీట్ల‌లో విజ‌య కేతనం ఎగుర‌వేసింది. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 12 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. ఇక సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తాయ‌నుకున్న ఆప్‌, తృణ‌మూల్‌ల‌కు చెరో రెండు సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఏకంగా న‌లుగురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.

40 సీట్ల అసెంబ్లీలో 21 సీట్లు వ‌స్తే స్పష్టమైన మెజారిటీ వ‌చ్చిన‌ట్టు. అయితే, బీజేపీ 20 సీట్లు మాత్ర‌మే ద‌క్కించుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. స్వ‌తంత్రులో, ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలో..ఎవ‌రో ఒక్క ఎమ్మెల్యే మ‌ద్దతు ద‌క్కితే బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైపోయిన‌ట్టే. ఆ దిశ‌గానే ఇప్పుడు బీజేపీ నేత‌లు వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఈ సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌ల‌వ‌నున్నారు.


More Telugu News