రండి.. ఉచిత సీట్లు, స్కాలర్ షిప్ లు ఇస్తాం.. జీఎంయూ ఆఫర్

  • ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు అవకాశం
  • గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ భారతీయుడే
  • అవకాశం కల్పించడం తమ బాధ్యత అంటూ ప్రకటన
ఉక్రెయిన్ నుంచి అర్థాంతరంగా భారత్ కు వెనక్కి వచ్చేసిన వైద్య విద్యార్థులకు యూఏఈలోని గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (జీఎంయూ) ఆహ్వానం పలికింది. ఉచిత సీట్లతోపాటు.. ప్రతిభావంతులకు స్కాలర్ షిప్ లు సైతం అందిస్తామని ప్రకటించింది. యూనివర్సిటీ అడ్మిషన్ కౌన్సిలర్లు విద్యార్థులకు కావాల్సిన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తారని.. వీసా సమకూర్చడం దగ్గర్నుంచి, వసతులు, అడ్మిషన్ బదిలీ వరకు అన్ని వ్యవహారాల్లో సాయం చేస్తారని తెలిపింది.

‘‘ఒక భారతీయుడిగా తోటి భారతీయ విద్యార్థులకు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడం నా బాధ్యత. యుద్ధం కారణంగా చెల్లాచెదురైన విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు, వారి విద్య పూర్తి అయ్యేందుకు సాయం అందిస్తాం’’ అని తంబే గ్రూపు వ్యవస్థాపకుడు, గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రెసిడెంట్ తంబే మొయినుద్దీన్ తెలిపారు.

యూనివర్సిటీ అడ్మిషన్ విధానానికి అనుగుణంగా విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఇటలీ, ఘనా, పోలండ్, మలేషియాలోని అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ తంబే గ్రూపు నిర్వహణలో ఉంది. 



More Telugu News