క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీశాంత్
- మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న శ్రీశాంత్
- యువతకు అవకాశాలు కల్పించేందుకు తప్పుకుంటున్నానని వ్యాఖ్య
- క్రికెట్ ను తాను ప్రతిక్షణం ఆస్వాదించానన్న శ్రీశాంత్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ స్పందిస్తూ... యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు పలకాలనే నిర్ణయం తనకు సంతోషాన్ని ఇవ్వనప్పటికీ... నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇది తన సొంత నిర్ణయమని అన్నారు. తన జీవితంలో తాను తీసుకున్న ఒక గౌరవప్రదమైన నిర్ణయం ఇది అని చెప్పాడు. క్రికెట్ ను తాను ప్రతి క్షణం ఆస్వాదించానని తెలిపాడు. దేశానికి ఆడటం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు.
2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీశాంత్ దోషిగా తేలాడు. దీంతో ఆయనపై బీసీసీఐ ఏడేళ్ల నిషేధం విధించింది. 2020 సెప్టెంబర్ నాటికి నిషేధం ముగిసినప్పటికీ... ఇండియా తరపున ఆడే అవకాశం అతనికి దక్కలేదు. ఇండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 87 వికెట్లు, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో 44 వికెట్లు తీశాడు.