వేయి రోజులు.. వేయి తప్పులు: జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ చార్జిషీట్‌

  • ప్ర‌జా చార్జిషీట్ పేరిట పుస్త‌కం విడుద‌ల‌
  • జ‌గ‌న్‌పై అచ్చెన్న ఘాటు వ్యాఖ్య‌లు
  • జ‌గ‌న్ పాల‌న‌లోని కీల‌క ఘ‌ట్టాల‌ను ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు
ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ వెయ్యి రోజుల పాల‌న‌ను పూర్తి చేసుకున్న వైనంపై ఇటీవ‌లే వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంబ‌రాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌గ‌న్ వెయ్యి రోజుల పాల‌న‌పై విప‌క్ష టీడీపీ ఏకంగా ఓ బుక్కునే రిలీజ్ చేసేసింది.

'వేయి రోజుల పాల‌న‌- వేయి త‌ప్పులు' పేరిట రూపొందించిన ఈ బుక్కును టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ నేత‌లు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, న‌క్కా ఆనంద్ బాబు తదిత‌రులు బుధ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విడుద‌ల చేశారు. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, "అశుభంతో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే. సమస్యల పరిష్కారానికి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల నిర్ణయంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.

రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని చంపేశారు. ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగపడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో అన్నీ నేరాలు, ఘోరాలే. సొంత బాబాయి వివేకాతో పాటు కోడెల, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు ఈ ప్రభుత్వమే కారణం" అని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News