ఉద్యోగాల ప్ర‌క‌ట‌న బీజేపీ విజ‌య‌మే: బండి సంజ‌య్‌

  • జోనల్ విధానానికి 2018లోనే ఆమోదం
  • కేసీఆర్ నాలుగేళ్లు జాప్యం చేశారు
  • ఆ నింద‌ను బీజేపీపై వేస్తున్నారు 
90 వేల పైచిలుకు ఉద్యోగాల‌ను ఏక కాలంలో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ బుధ‌వారం చేసిన ప్ర‌క‌ట‌న‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. నిరుద్యోగులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాల్లో మునిగిపోతే.. టీఆర్ఎస్ వైరి వ‌ర్గాలు మాత్రం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అ‌న్న కోణంలో శోధ‌న చేస్తున్నాయి. కేసీఆర్ ఉద్యోగ  ప్ర‌క‌ట‌న‌పై ఇప్ప‌టికే ప‌లు పార్టీల నేత‌లు స్పందించ‌గా.. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ స్పందించారు. కేసీఆర్ ఉద్యోగ ప్ర‌క‌ట‌న త‌మ పార్టీ సాధించిన విజ‌య‌మేన‌ని ఆయన పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బండి సంజ‌య్ విరుచుకుప‌డ్డారు. ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లో జాప్యానికి కార‌ణం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయ‌న విమ‌ర్శించారు. జోన‌ల్ విధానానికి 2018లోనే రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేసిన వైనాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌పై నాలుగేళ్ల పాటు ఆల‌స్యం చేసిన కేసీఆర్‌..ఆ నింద‌ను మాత్రం బీజేపీపై వేసేందుకు య‌త్నిస్తున్నారన్నారు. ఆల‌స్యంగా వ‌చ్చినా ఉద్యోగ ప్ర‌క‌ట‌న బీజేపీ విజ‌య‌మేన‌ని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.


More Telugu News