రాజకీయాల కోసమే కేసీఆర్‌ విమర్శలు చేసినట్లున్నారు: ఏపీ మంత్రి కన్నబాబు విమర్శ

  • తెలంగాణ అసెంబ్లీలో ఏపీ ప్ర‌స్తావ‌న తెచ్చిన కేసీఆర్‌
  • విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి న‌ష్ట‌మేన‌న్న కన్నబాబు 
  • రూ.5 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను ఇవ్వలేదని విమర్శ  
  • ప్ర‌ధాని మోదీనే స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేశార‌ని ప్ర‌స్తావ‌న‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను ఏపీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తిప్పికొట్టారు. రాజకీయాల కోస‌మే కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసిన‌ట్టున్నార‌న్న క‌న్న‌బాబు.. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాక‌పోవ‌డం మూలంగా ఏపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని, ఈ విష‌యాన్ని పార్ల‌మెంటు సాక్షిగా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీనే స్వ‌యంగా వెల్ల‌డించార‌ని పేర్కొన్నారు. 

తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి బుధ‌వారం నాటి అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌న‌ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా ఏపీపై కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ నోట నుంచి వ‌చ్చిన ఈ విమ‌ర్శ‌ల‌పై క‌న్న‌బాబు చాలా వేగంగా స్పందించారు. ఈ మేర‌కు రెండు వ‌రుస ట్వీట్ల‌లో కేసీఆర్ తీరును క‌న్న‌బాబు ఖండించారు.

"రాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శలు చేసినట్లున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఏపీ నష్టపోయింది. విభజన వల్ల ఏపీ నష్టపోయిందని పార్లమెంట్‌లో ప్రధానినే చెప్పారు. ఏపీకి రావాల్సిన రూ.5 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను తెలంగాణ ఇవ్వలేదు. ఉమ్మడి సంస్థలన్నింటినీ విభజించలేదు. ఏపీ ఆఫీసుల తాళాలు బద్దలు కొట్టి తెలంగాణ వాడుకుంటోంది. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు ఏపీ ఆస్తులన్నింటిని వదిలేసి వచ్చారు" అని కన్నబాబు ఫైర‌య్యారు.


More Telugu News