బీజేపీ భయంతో గోవాలో అభ్యర్థులను రిసార్టులకు తరలిస్తున్న పార్టీలు

  • హంగ్ ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్
  • ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు
  • అదే జరిగితే బీజేపీ చక్రం తిప్పడం ఖాయమన్న గుబులు
  • అభ్యర్థులు చేజారిపోకుండా పార్టీల రక్షణ ఏర్పాట్లు
ఎగ్జిట్ పోల్స్ తర్వాత గోవాలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. పార్టీల్లో అంతర్గతంగా గుబులు మొదలైంది. అధికార బీజేపీ తమ అభ్యర్థులను గద్దలా తన్నుకుపోతుందన్న ఆందోళన ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది. గోవాలో ఏ పార్టీకీ అధికారానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని ఈ నెల 7న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడవడం తెలిసిందే. 

ఇదే ఇప్పుడు పార్టీలను వణికిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులు అందరినీ రిసార్టులకు తరలించి వారి చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకుంది. ఎవరు గెలుస్తారో తెలియదు. ఫలితం వచ్చే వరకూ ఆగితే, ఆ తర్వాత వారి జాడను గుర్తించడం అసాధ్యమనే ఆందోళన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల్లో కనిపిస్తోంది. దీనికి గత అనుభవాలు నిదర్శనంగా ఉన్నాయి. 

గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాలు కావాల్సి ఉంటుంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మెజారిటీ మార్క్ కు కావాల్సిన మరో నాలుగు స్థానాల కోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టలేకపోయింది. దీంతో 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీ చక్రం తిప్పింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను తనవైపు ఆకర్షించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని కాంగ్రెస్, ఆప్ లో గుబులు మొదలైంది. అందుకే ముందే మేల్కొంటున్నాయి. అభ్యర్థులు చేజారిపోకుండా చర్యలు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఉత్తర గోవాలోని రిసార్ట్ లకు తరలించగా.. ఆప్ కూడా తన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సీనియర్ నేత పి.చిదంబరాన్ని గోవాకు పంపించింది. తమ పార్టీ అభ్యర్థులను తన్నుకుపోకుండా కాపాడుకుంటామని ఆయన ప్రకటించారు. ఇక బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇతర పార్టీల మద్దతుపై కాంగ్రెస్ చర్చలు కూడా ప్రారంభించింది.


More Telugu News