‘సంతాన భాగ్యానికి’ ఈ మాత్రం శ్రద్థ అవసరం సుమా!

  • మారిన జీవన శైలితో తగ్గుతున్న అవకాశాలు
  • ఒత్తిడులు, మధుమేహం, థైరాయిడ్, ఒబెసిటీ ప్రభావం
  • కారణాలు గుర్తిస్తే తగిన పరిష్కారం
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
  • ఆహారం, జీవనశైలిలో మార్పులతో ఫలితాలు
గతంతో పోలిస్తే పురుషుల్లో సంతాన సాఫల్యత అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎక్కువ మందిలో తగినంత సంఖ్యలో, ఆరోగ్యకరమైన వీర్యకణాల ఉత్పత్తి లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటోంది. వీర్యకణాలకు తోడ్పడే ఫ్రక్టోస్ వారిలో లోపిస్తోంది. ఇది దంపతులకు తల్లిదండ్రులయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. అందుకే నేడు చాలా మంది పిల్లలు లేకపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. 

వీర్యకణాల ఉత్పత్తి తగినంత లేకపోవడానికి ఒత్తిళ్లు, పోషకాల లేమి, మధుమేహం, థైరాయిడ్, ఒబెసిటీ, గుండె జబ్బులు, కేన్సర్ చికిత్సలో భాగంగా తీసుకునే కీమో థెరపీ, చెడు అలవాట్లు (టుబాకో, ఆల్కహాల్), చాలా వేడితో కూడిన వాతావరణంలో పనిచేస్తుండడం కారణాలుగా ఉంటున్నాయి. 

స్త్రీలకు వయసు పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యతా అవకాశాలు తగ్గిపోతుంటాయి. మగవారిలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంటుంది. ఇది కూడా సంతాన భాగ్యానికి దూరం చేయవచ్చు. 

హెల్త్ చెకప్
దంపతులు ఇద్దరూ వైద్యుల వద్దకు వెళ్లి అవసరమైన అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అంతర్గతంగా ఎటువంటి వ్యాధులు లేవని ధ్రువీకరించుకోవాలి. అడ్డంకులు ఉంటే గుర్తించి చికిత్స తీసుకోవడానికి వీలుంటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. అందుకని పరిశుభ్రత పాటించాలి.

చెడు అలవాట్లు
పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల సేవనం సంతాన అవకాశాలను దెబ్బతీస్తాయి. ఎప్పుడో ఓసారి మితంగా ఆల్కహాల్ తీసుకుంటే నష్టం పెద్దగా ఉండదు కానీ, తరచుగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. పొగతాగే అలవాటు వీర్యకణాల చలన శీలతపై ప్రభావం చూపిస్తుంది. ఇది డీఎన్ఏ దెబ్బతినేందుకు కారణం కావచ్చు. కనుక పిల్లలు కావాలనుకునే వారు ఈ అలవాట్లను విడిచి పెట్టేయాలి.

ఆరోగ్యకర జీవన శైలి
పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పోషకాహారాన్ని సరైన సమయానికి, సరైన మోతాదులో తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉండడమే కాకుండా, జీవక్రియలు ఆరోగ్యకరంగా సాగుతాయి. అప్పుడు వీర్య ఉత్పత్తి కూడా ఆరోగ్యకరంగా  నడుస్తుంది. శరీర బరువు వీర్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందేలా చూసుకోవాలి. 

కూర్చుని చేసే పనులు
ఎక్కువ గంటల పాటు సిస్టమ్స్ ముందు కూర్చుని పనిచేసే వారికి సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లుతుంది. అన్నేసి గంటలు కూర్చోవడం కారణంగా జనన అవయవాల ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి వాతావరణంలో పనులు చేసే వారికీ ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే, రసాయనాల ప్రభావం ఉండే ప్రాంతాల్లోని వారిపైనా ఈ ప్రతికూలతల ప్రభావం ఉంటుంది. ఇటువంటి వారు తగిన మార్పులు చేసుకోవాలి.

మానసిక ఆరోగ్యం
మానసిక ఆరోగ్యం కూడా సంతాన సాఫల్యతా సామర్థ్యాలను నిర్ణయిస్తుంటుంది. ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే పనులు చేస్తున్న వారు ఇంటికి వచ్చిన వెంటనే ప్రాణాయామం, యోగాసనాలతో ఒత్తిడులను పూర్తిగా తొలగించుకోవాలి.


More Telugu News