జ‌గ‌న్ 3 రాజ‌ధానుల‌ను వ‌దిలేసిన‌ట్లే క‌న‌ప‌డుతోంది: జేసీ దివాక‌ర్ రెడ్డి

  • హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జేసీ
  • రాజ‌ధాని అంశం సీఎం జ‌గ‌న్ ఇష్టమంటూ కామెంట్ 
  • కేసీఆర్ చేసిన‌ ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తున్నాన‌ని వ్యాఖ్య‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని గురించి రాష్ట్ర‌ మంత్రి బొత్స సత్సనారాయణ ఇటీవ‌ల ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, అయితే, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి స్పందించారు. 

ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... మంత్రి బొత్స మళ్లీ హైదరాబాద్ రావాలని అనుకుంటున్నారని, ఇక్క‌డే మ‌రో రెండేళ్లు ఉండాల‌ని అనుకుంటున్నార‌ని అన్నారు. ఏపీలో ఒకటి కాకుంటే, పది రాజధానులు కట్టుకోండని, అది సీఎం జ‌గ‌న్ ఇష్టమ‌ని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అస‌లు జ‌గ‌న్ 3 రాజ‌ధానుల‌ను వ‌దిలేసిన‌ట్లే క‌న‌ప‌డుతోందని జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే బొత్స ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. 

సీఎంల‌ను క‌లిసే విష‌యంలో గ‌తంలోలా ప‌రిస్థితులు లేవని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌లుద్దామ‌ని అనుకున్నానని, అయితే, వీలు ప‌డ‌ట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ‌లో కేసీఆర్ చేసిన‌ ఉద్యోగాల భ‌ర్తీ ప్రకటనను స్వాగతిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.


More Telugu News