సీఎస్కే లక్కీ.. ఏప్రిల్ మధ్య నుంచి చాహర్ అందుబాటు!

  • ప్రస్తుతానికి సర్జరీ ఆలోచన విరమణ
  • బెంగళూరులోని ఎన్ సీఏలో రీహాబిలిటేషన్ 
  • విశ్రాంతి ఏప్రిల్ మధ్యనాటికి ముగిసే అవకాశం 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఊపిరి తీసుకోనుంది. రూ.14 కోట్లు పెట్టి, ఎన్నో ఆశలతో సొంతం చేసుకున్న పేసర్ దీపక్ చాహర్ ఏప్రిల్ మధ్య నాటికి జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా చాహర్ గత నెల గాయపడడం తెలిసిందే. వాస్తవానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంది. కానీ, కేవలం విశ్రాంతితోనే సరిపెడదామన్నది చాహర్ ఆలోచనగా తెలిసింది. తద్వారా తనపై అంచనాలు పెట్టుకున్న జట్టుకు అందుబాటులో ఉండొచ్చని భావిస్తున్నాడు.

ఎంఆర్ఐ తర్వాత వైద్యుల సూచన మేరకు సర్జరీకి వెళదామనే అనుకున్నాడు. కానీ సర్జరీ తర్వాత కోలుకోవడానికి సమయం పడుతుంది. ఐపీఎల్ తోపాటు, ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ కు ఫిట్ నెస్ సాధించడం కష్టమన్న అభిప్రాయంతో దాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నట్టు సమాచారం. దీంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అసోసియేషన్ వద్ద ఎనిమిది వారాల రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఇది ఏప్రిల్ మధ్యనాటికి ముగుస్తుంది.

సీఎస్కే జట్టు ఇప్పటికే ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం సూరత్ వెళ్లింది. వీలైనంత త్వరగా చాహర్ వచ్చి జట్టులో చేరాలన్నది ఫ్రాంచైజీ ఆకాంక్ష. చాహర్ ఫిట్ నెస్ ఆధారంగా అతడితో ఆడించడంపై నిర్ణయం తీసుకోనుంది.


More Telugu News