మరికొన్ని గంటల్లో రష్యా హస్తగతం కానున్న ఉక్రెయిన్ రాజధాని.. కీవ్ సమీపానికి రష్యన్ సేనలు

  • కీవ్, తూర్పు, సెంట్రల్ రీజియన్లపై రాత్రంతా బాంబుల వర్షం
  • దేశాన్ని విడిచిపెట్టిన 2 మిలియన్ల మంది
  • రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని పౌరులకు జెలెన్‌స్కీ పిలుపు
  • రష్యాలో అమ్మకాలు నిలిపేసిన పెప్సీ, కోకా-కోలా
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరుసగా 14వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్‌లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. వీరిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. 

 మరోపక్క, రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ పౌరులకు పిలుపునిచ్చారు. ఇదిలావుంచితే, రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది.

ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.


More Telugu News