తెలంగాణలో ఓ కొండ గుహలో వింత శబ్దాలు... ఏంటని చూస్తే...!

  • మంచిర్యాల జిల్లాలో ఘటన
  • రామాలయం నిర్మించాలనుకున్న గ్రామస్తులు
  • కొండ ప్రాంతం పరిశీలన
  • గుహలో పదుల సంఖ్యలో భారీ కొండచిలువలు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ కొండ గుహ వద్ద వింత ధ్వనులు కలకలం రేపాయి. తీరా చూస్తే పదుల సంఖ్యలో ప్రాణాంతక కొండచిలువలు దర్శనమిచ్చాయి. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామం పక్కనే ఓ కొండపై రామాలయం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. కొండ ప్రాంతాన్ని పరిశీలించేందుకు గ్రామస్తులు వెళ్లగా, అక్కడ ఉన్న చిన్న గుహలో విచిత్రమైన శబ్దాలు వస్తుండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

దగ్గరకు వెళ్లి చూసి హడలిపోయారు. ఆ గుహలో పెద్ద సంఖ్యలో కొండచిలువ పాములు దర్శనమిచ్చాయి. ఒక్కోటి పది అడుగుల పొడవు ఉన్న ఆ పాములను చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. దాంతో, అటవీశాఖ అధికారులకు విషయం తెలియజేశారు. కొండగుహ వద్దకు వచ్చిన అధికారులు ఆ భారీ కొండచిలువలను పట్టి బంధించి సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో వెంకట్రావుపేట గ్రామస్తులు హమ్మయ్య అనుకున్నారు.


More Telugu News