అది ఫేక్ న్యూస్.. అంటూ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు టీడీపీ కౌంటర్!

  • చంద్ర‌బాబు పిటిష‌న్‌ను సుప్రీం కొట్టేసిన‌ట్టు క‌థ‌నం
  • వీవీ ప్యాట్ల ప‌రిశీల‌న‌పై బాబు పిటిష‌న్ వేశార‌ట‌
  • టైమ్స్ క‌థ‌నం త‌ప్పంటూ టీడీపీ క్విక్ రియాక్ష‌న్‌
  • టైమ్స్‌కు బాధ్య‌త‌లు గుర్తు చేస్తూ టీడీపీ ట్వీట్‌
దేశంలోని మీడియా సంస్థ‌ల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. జాతీయ మీడియా సంస్థ‌ల్లో టైమ్స్‌ది ప్ర‌ముఖ స్థాన‌మే. అలాంటి టైమ్స్‌కు ఏపీలోని విప‌క్ష పార్టీ తెలుగు దేశం పార్టీ గ‌ట్టి షాకిచ్చింది. టైమ్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు చెందిన ఓ వార్త‌ను ప్ర‌చురించ‌గా.. నిత్యం య‌మా యాక్టివ్‌గా ఉండే టీడీపీ డిజిట‌ల్ సేన దాన్ని తిప్పి కొట్టింది. టైమ్స్ వార్త ఫేక్ అంటూ ఆ ప‌త్రిక‌కు గుర్తు చేస్తూ టీడీపీ రీ ట్వీట్ చేసింది. దీంతో జ‌రిగిన త‌ప్పు తెలుసుకున్న టైమ్స్ స‌ద‌రు వార్త‌ను తొల‌గించేసింది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఎన్నిక‌ల్లో వినియోగించే ఈవీఎంల‌కు చెందిన వీవీ ప్యాట్ల ప‌రిశీల‌న‌కు ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాన్ని మార్చాల‌ని చంద్ర‌బాబు సుప్రీంకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ట‌. అంతేకాకుండా స‌ద‌రు పిటిష‌న్‌ను ఆయ‌న అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని కూడా కోరార‌ట‌. అయితే దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింద‌ట‌. ఇదీ టైమ్స్ క‌థ‌నంలోని సారాంశం.

ఈ వార్త‌ను చూసినంత‌నే టీడీపీ చాలా వేగంగా స్పందించింది. అదో ఫేక్ వార్త అని ట్వీట్ చేసింది. దానికి టైమ్స్ క‌థ‌నాన్ని కూడా జోడించి..దానిపై ఫేక్ వార్త అంటూ ఓ ముద్ర వేసి పెట్టేసింది. అంతేకాకుండా.. తాము టైమ్స్ న్యూస్‌ను చూస్తామ‌ని, నిత్యం ఫాలో అవుతామ‌ని టీడీపీ తెలిపింది. అంతేకాకుండా టైమ్స్ ఇలాంటి వార్త‌ల‌ను ఎలాంటి ప‌రిశీల‌న లేకుండా ప్ర‌చురించ‌రాద‌ని కూడా అభిప్రాయ‌ప‌డింది. ఇలాంటి పొర‌పాట్ల వ‌ల్ల ద‌శాబ్దాల కృషితో టైమ్స్ సంపాదించుకున్న విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని కూడా ఆ ప‌త్రిక యాజ‌మాన్యానికి గుర్తు చేసింది. టీడీపీ సంధించిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


More Telugu News