రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నా: సీఎం కేసీఆర్

  • వనపర్తి జిల్లా నాగవరంలో సీఎం కేసీఆర్ సభ
  • రేపు నిరుద్యోగులు టీవీలో తన ప్రకటన చూడాలన్న కేసీఆర్
  • ఇక దేశం కోసం కొట్లాడుదామని పిలుపు
  • తెలంగాణ సస్యశ్యామలం అయిందని వెల్లడి
వనపర్తి జిల్లా నాగవరంలో నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని, నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని వెల్లడించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని అన్నారు. తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో, దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. 

వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని అన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని, తెలంగాణ వచ్చాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని వివరించారు. 

హైదరాబాదు నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా పాలుగారుతోందని, తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి వచ్చారని తెలిపారు. 11 రాష్ట్రాల నుంచి పనుల కోసం తెలంగాణకే వలస వస్తున్నారని అన్నారు. తెలంగాణలో త్వరలో అద్భుతమైన పల్లెలు రూపుదిద్దుకోనున్నాయని పేర్కొన్నారు.


More Telugu News