మహిళ చీర లాగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్

  • నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత అక్రమ లేఅవుట్ ను అడ్డుకున్న గ్రామస్తులపై దాడి చేశారు
  • పోలీసులు సభ్యసమాజం తలదించుకునేలా చేశారు
  • గ్రామకంఠం భూములను ఆక్రమించిన వైసీపీ నేతపై కేసు నమోదు చేయాలన్న లోకేశ్ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా మహిళలపై వైసీపీ అరాచకాలు కొనసాగాయని, ఇది రాష్ట్రంలోని దుస్థితికి అద్దం పడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. మహిళలకి భద్రత కల్పించాల్సిన పోలీసులే, వైసీపీ నేతల కోసం దుశ్శాసనపర్వాన్ని సాగించడం తీవ్ర విచారకరమని అన్నారు.  

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దఅన్నలూరు గ్రామంలో వైసీపీ నేత వేస్తున్న అక్రమ లేఅవుట్ ని అడ్డుకున్న గ్రామస్తులపై దాడిచేసిన పోలీసులు మహిళ చీర లాగేసిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవడమే తప్పని అన్నారు. 

వైసీపీ నేత అక్రమ లేఅవుట్ కోసం మహిళని వివస్త్రని చేసి, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూములు ఆక్రమించిన వైసీపీ నేతపై కేసు నమోదు చేయాలని లోకేశ్ అన్నారు.


More Telugu News