తెలంగాణలో మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల కోసం వీ హ‌బ్‌

  • సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో పార్కు
  • 50 ఎక‌రాల స్థ‌లంలో ఇప్ప‌టికే ప‌లు ప‌రిశ్ర‌మ‌లు
  • తొలి మ‌హిళా వ‌ర్సిటీ కోసం రూ.100 కోట్లు
  • 9 వేల కోట్లతో 'కల్యాణలక్ష్మీ; పథకాన్ని తెచ్చామన్న మంత్రి కేటీఆర్ 
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఇందులో భాగంగా ప‌రిశ్ర‌మ‌లు పెట్టాల‌నుకునే ఔత్సాహిక మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ప్ర‌త్యేకంగా వీ హ‌బ్ పేరిట ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌ను ఏర్పాటు చేసిన‌ట్టుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌ద‌రు పార్క్ ఫొటోల‌ను కూడా పోస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అనే సంబర పడే రోజులు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. అడపిల్లలందరికీ కేసీఆర్‌ మేనమామ అయ్యారని, మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. 

కుల, మత తారతమ్యం లేకుండా 9 వేల కోట్లతో కల్యాణలక్ష్మీ పథకాన్ని తీసుకువచ్చి, 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి సాయం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఇప్పటి వరకు 11 లక్షల కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన అన్నారు.

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు వీ-హబ్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. సోమ‌వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పటాన్‌చెరులో 350 పడకల ఆసుపత్రికి నిధులు కేటాయించామని, తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మహిళా దినోత్సవ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఈ బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News