9వ ప్రాధాన్య‌త‌లో కాంట్రాక్ట‌ర్లు.. ఏపీ స‌ర్కారుపై హైకోర్టు ఆగ్ర‌హం

  • నెల‌ల త‌ర‌బ‌డి కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల పెండింగ్‌
  • కాంట్రాక్ట‌ర్ల పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ‌
  • కోర్టుకు హాజ‌రైన సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌
  • త‌క్ష‌ణ‌మే బిల్లులు చెల్లించాల‌ని హైకోర్టు ఆదేశం
ఏపీలోని ప్రభుత్వ పనుల కాంట్రాక్ట‌ర్లు త‌మ‌కు రెండేళ్ల పైబ‌డి బిల్లులు పెండింగ్ ఉండ‌టంపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. కాంట్రాక్ట‌ర్ల పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు..ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా దానిపై విచార‌ణ చేప‌ట్టింది. తాజాగా మంగ‌ళవారం కూడా ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ్గా... ఈ విచార‌ణ‌కు నేరుగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ హైకోర్టుకు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు త‌క్ష‌ణ‌మే బిల్లులు చెల్లించాల‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం చెప్ప‌గా.. ప్రాధాన్య‌తా క్ర‌మంలో బిల్లులు చెల్లిస్తున్నామ‌ని స‌మీర్ శ‌ర్మ వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌ను 9వ ప్రాధాన్యతగా గుర్తిస్తే.. ఇక ప్ర‌భుత్వ ప‌నుల‌ను చేసేందుకు కాంట్రాక్ట‌ర్లు ఎలా ముందుకు వ‌స్తారంటూ హైకోర్టు మండిప‌డింది. అయినా ప్ర‌భుత్వ ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌ను 9వ ప్రాధాన్య‌త‌గా ఎలా గుర్తిస్తార‌ని కూడా హైకోర్టు ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికైనా కాంట్రాక్ట‌ర్ల‌కు త‌క్ష‌ణ‌మే బిల్లులు చెల్లించేలా ఆయా శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News