మైల‌వ‌రం వెళ్తుండ‌గా దేవినేని ఉమ‌ను అడ్డుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో

  • మైలవరం రెవెన్యూ డివిజన్ కోసం బంద్ పిలుపు
  • గొల్లపూడి కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్త‌త‌
  • పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదం
టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మైలవరం బంద్ కార్యక్రమానికి వెళ్తుండ‌గా ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. మైలవరం రెవెన్యూ డివిజన్ కోసం బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చిన నేప‌థ్యంలో దేవినేని ఉమ అక్క‌డ‌కు బ‌య‌లుదేరుతుండ‌గా గొల్లపూడి కార్యాలయం దగ్గర ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. అనంత‌రం ఆయ‌న‌ను పోలీసులు ఇంటికి త‌ర‌లించి హౌస్ అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

'నన్ను కార్యాలయం నుండి బయటికి పోకుండా అడ్డుకునే హక్కు మీకెక్కడిది? ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తుంది. రెవెన్యూ డివిజన్ సాధించడం చేతగాని మైలవరం ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెబుతాడు? మీ తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రజల పక్షాన నా పోరాటాన్ని ఆపలేరు' అని దేవినేని ఉమ ట్విట్టర్‌లోనూ పేర్కొన్నారు. త‌న‌ను పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

మైలవరం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని దేవినేని ఉమ మండిప‌డ్డారు. త‌మ‌కు నోటీసులు ఇవ్వ‌కుండానే పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

మైలవరం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతం మొత్తం పోలీసుల దిగ్బంధంలో ఉంది. ఈ బంద్‌కు టీడీపీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌‌ మద్దతు తెలిపాయి. మరోపక్క, బంద్‌కు అనుమతులు లేవ‌ని పోలీసులు చెబుతున్నారు. ఎవ‌రైనా అక్క‌డి దుకాణలను బలవంతంగా మూసివేయిస్తే కనుక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు మైలవరంలో హోటళ్ల‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి.


More Telugu News