నేను స‌క్సెస్‌ఫుల్ హీరో కావ‌డానికి సురేఖ‌నే కార‌ణం: చిరంజీవి

  • నేను కూడా ఫెమినిస్టుని అయిపోయానేమోన‌ని ఒక్కోసారి అనిపిస్తుంది
  • స్త్రీ ప‌క్ష‌పాతిగా ఉండ‌డానికి మ‌రోకార‌ణం సురేఖ
  • అల్లు వారి ఇంట్లో ఆమె చిన్న బిడ్డ 
  • పెళ్లి చేసుకున్నాక పెద్ద కోడ‌లు అయిందన్న చిరు 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త‌మ చారిటబుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో మెగాస్టార్ చిరంజీవి ఓ కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హిళా సాధికార‌త కోసం అంద‌రూ కృషి చేయాలని చెప్పారు. త‌న త‌ల్లికి 16 ఏళ్లు పూర్తికాక‌ముందే తాను జ‌న్మించాన‌ని అన్నారు. ఇంట్లో ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అన్ని ప‌నులూ ఆమే చేసేద‌ని గుర్తు చేసుకున్నారు. మ‌హిళ‌లు ప‌డే క‌ష్టానికి వారు ఏమీ కోరుకోర‌ని చెప్పారు. 

మ‌హిళ‌ల నోరు తీపి చేద్దామ‌ని త‌న భార్య సురేఖ చెప్ప‌డంతో తాను ఈ రోజు ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశాన‌ని అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి త‌న భార్య సురేఖనే కారణమ‌ని చిరంజీవి అన్నారు. తాను కూడా ఫెమినిస్టుని అయిపోయానేమోన‌ని ఒక్కోసారి అనిపిస్తుంద‌ని చెప్పారు. తాను స్త్రీ ప‌క్ష‌పాతిగా ఉండ‌డానికి మ‌రోకార‌ణం సురేఖ అని అన్నారు.

అల్లు వారి ఇంట్లో ఆమె చిన్న బిడ్డ అని, గారాల ప‌ట్టి అని వెల్లడించారు. కానీ, త‌న‌ను పెళ్లి చేసుకున్నాక తమ ఇంటికి పెద్ద కోడ‌లు అయింద‌ని అన్నారు. త‌న‌ను పెళ్లి చేసుకున్నాక త‌న కుటుంబాన్ని ఆమే చూసుకుంద‌ని ప్రశంసించారు. అందుకే తాను స‌క్సెస్ ఫుల్ హీరోగా ఉండ‌డానికి ఆమే కార‌ణ‌మ‌ని చెబుతున్నాన‌ని అన్నారు.

పుట్టినింటితో పాటు మెట్టినింటి బాధ్య‌త‌ల‌ను తీసుకుంటూ మ‌హిళ‌లు ఆద‌ర్శంగా నిలుస్తార‌ని చెప్పారు. అంత‌రిక్షంలోకి మ‌హిళ‌లు వెళ్తున్నార‌ని అన్నారు. అన్ని రంగాల్లోనూ గొప్ప విజ‌యాలు సాధిస్తూ మ‌హిళా సాధికార‌త సాధిస్తున్నార‌ని చెప్పారు. చంద్ర‌మండ‌లం, ఒలింపిక్స్ స్థాయికి మ‌హిళ‌లు ఎదిగార‌ని వ్యాఖ్యానించారు. మొద‌ట మ‌నం ఇంట్లో అమ్మ, సోద‌రిల సాధికార‌త‌ను కృషి చేయాల‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచం గ‌ర్వించే స్థాయిలో స్త్రీ శ‌క్తి ఉండాల‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News