నూనె ధరల మంటకు వినియోగదారులే ఆజ్యం పోస్తున్నారా..?

  • 90 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి ఉక్రెయిన్, రష్యా నుంచే
  • యుద్ధంతో సరఫరా ఆగిపోతుందన్న భయాలు
  • కొని నిల్వ చేసుకునేందుకు మొగ్గు
  • ఫలితంగా సరఫరా, ధరలపై ఒత్తిళ్లు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధ సంక్షోభంతో వంట నూనెలకు కొరత ఏర్పడొచ్చు..! కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలు ఇవి. వీటిని చూసి వినియోగదారులు కంగారు పడిపోయి వంట నూనె ధరలు భారీగా పెరిగిపోతాయేమోనన్న భయంతో ఒకేసారి రెండు, మూడు నెలలకు సరిపడా కొనుగోలు చేసుకుంటున్నారు. సరిపడా నిల్వలు ఉన్నాయని,  ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదని పరిశ్రమ వర్గాలు ఇప్పటికే భరోసా ఇచ్చినా వినియోగదారుల్లో భయాలు పోలేదని తెలుస్తోంది.

ఉక్రెయిన్ లో వంట నూనెల సాగు ఎక్కువ. ఆ దేశంతోపాటు, రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి నూనెలు భారత్ కు ఎప్పటి మాదిరిగా సరఫరా అయ్యే పరిస్థితి అయితే తాత్కాలికంగా లేదనే చెప్పుకోవాలి. యుద్ధం ఆగిపోతే తిరిగి సరఫరాలకు అవకాశం ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ కూడా దృష్టి పెట్టింది. 

కానీ, వినియోగదారుల నుంచి వంట నూనెలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు గత రెండు వారాల్లో 10-20 శాతం మధ్య పెరిగాయి. పామాయిల్ ధర అయితే 40 శాతం వరకు పెరిగింది. ఈ ధరలు పెరిగిపోవడం కూడా వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఇంకా పెరిగిపోతే కొనడం కష్టమనే ధోరణితో మరింత మంది కొని నిల్వ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం కనిపిస్తోంది. 

మన దేశ అవసరాల్లో 90 శాతానికి పైగా సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశం మొత్తం వంట నూనెల అవసరాల్లో సన్ ఫ్లవర్ వినియోగం వాటా 14 శాతంగానే ఉంది. పామాయిల్, సోయా, వేరుశనగ నూనెల సరఫరా తగినంత ఉందని, ఆందోళన అనవసరమని ముంబైకి చెందిన సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు.


More Telugu News