మూడు రాజధానులకు తోడుగా నాలుగో రాజధాని కూడా వచ్చి చేరింది: పయ్యావుల కేశవ్

  • 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్ అని చెప్పిన మంత్రి బొత్స
  • వైసీపీ నేతలు హైదరాబాద్ నే రాజధానిగా భావిస్తున్నారన్న పయ్యావుల
  • కేసీఆర్ రుణం జగన్ తీర్చుకుంటున్నారని విమర్శ
2024 వరకు ఏపీకి హైదరాబాద్ రాజధాని అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని... ఇప్పుడు నాలుగో రాజధానిగా హైదరాబాద్ వచ్చి చేరిందని ఆయన ఎద్దేవా చేశారు.

 గత ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా సాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణం తీర్చుకోవడానికి ఏపీని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేతల మనసుల్లో ఎంత వ్యతిరేకత ఉందో బొత్స వ్యాఖ్యలతో మరోసారి బయటపడిందని అన్నారు. 

వైసీపీ నేతలు ఇప్పటికీ హైదరాబాద్ నే రాజధానిగా భావిస్తున్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి విషయంలో వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మౌనంగా ఉండటమే కేసీఆర్ కు కావాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఘోరంగా జరుగుతున్నాయని... కాలేజీల్లో ర్యాగింగ్ ను తలపించేలా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.


More Telugu News