దారుణంగా రష్యా పరిస్థితి.. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల్లో ఫస్ట్!

  • ప్రపంచ దేశాల ఆంక్షలను బేఖాతరు చేస్తున్న రష్యా
  • ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు
  • ‘ఇది ఆర్థిక అణుయుద్ధం’ అన్న యూఎస్ మాజీ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారి
  •  రష్యాపై 5,530 దాటేసిన ఆంక్షల సంఖ్య 
ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత రష్యా మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా జాబితాకెక్కింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన పదిరోజుల్లోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో చేరిపోయింది. 

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేయడంతో ఏకైక ఆయుధమైన ఆంక్షల అస్త్రాన్ని బయటకు తీశాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఆయుధాలతో విరుచుకుపడుతుంటే.. ఇతర దేశాలన్నీ రష్యాపై ఆంక్షల దాడిని తీవ్రతరం చేశాయి. అయినప్పటికీ వెరవని రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది.

ఓ వైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు, ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పటి వరకు 2,778 కొత్త ఆంక్షలను రష్యాపై విధించాయి. ఫలితంగా ఆ దేశంపై ఉన్న మొత్తం ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపై ఉన్న ఆంక్షలను గణించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) ఈ వివరాలను వెల్లడించింది. అణు కార్యక్రమం, తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందన్న కారణంతో ఇరాన్‌ గత దశాబ్ద కాలంగా 3,616 ఆంక్షలను ఎదుర్కొంటోంది.

ఇంకోవైపు, రష్యాపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. రష్యాలో కార్యకలాపాలను ఉపసంహరించుకోవడమో లేదంటే నిలిపివేయడమో చేసిన కంపెనీ జాబితాలో తాజాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, నెట్‌ఫ్లిక్స్ వంటివి కూడా చేరాయి. ఆంక్షల నేపథ్యంలోనే అవి ఈ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై ‘ఇది ఆర్థిక అణుయుద్ధం, చరిత్రలో అతిపెద్ద ఆంక్షల ఘటన’ అని ఒబామా, ట్రంప్ పరిపాలనా కాలంలోని మాజీ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారి పీటర్ పియాట్‌స్కీ అభివర్ణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రెండు వారాల్లోనే రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలకు లక్ష్యంగా మారడం గమనార్హం. రష్యా, ఇరాన్ తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో సిరియా, ఉత్తరకొరియా, వెనిజులా, మయన్మార్, క్యూబా ఉన్నాయి.


More Telugu News