చ‌ట్ట‌బ‌ద్ధ ప‌దవుల్లోని మ‌హిళ‌ల‌కూ గౌర‌వం ద‌క్క‌ట్లేదు: గ‌వ‌ర్న‌ర్ తమిళిసై

  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే తెలంగాణ‌ అసెంబ్లీ బ‌డ్జెట్ సెష‌న్స్‌
  • మ‌న‌సు నొచ్చుకున్న గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై
  • మ‌హిళా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌న స‌మాజంలో సాధార‌ణ మ‌హిళ‌ల‌కే కాదు.. అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న మ‌హిళ‌ల‌కు కూడా గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ఆమె అన్నారు. అయినా కూడా బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేదని, ఏదైనా సాధించాల‌నే త‌ప‌న‌తో ముందుకు సాగాల‌ని ఆమె మ‌హిళా లోకానికి పిలుపునిచ్చారు. 

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను సంప్ర‌దాయానికి భిన్నంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే సోమ‌వారం టీఆర్ఎస్ స‌ర్కారు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హా పద్ధతికి కొన్ని సాంకేతిక కార‌ణాల‌ను చూపిన టీఆర్ఎస్‌.. బీజేపీకి చెందిన త‌మిళిసైని అసెంబ్లీకి పిల‌వ‌డం ఎందుక‌న్న భావ‌న‌తోనే ఈ చ‌ర్చ‌కు దిగింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త పధ్ధతిపైనే కాకుండా త‌న‌ను అసెంబ్లీకి రానీయ‌కుండా చేసిన వైనంపై త‌మిళిసై ఇప్ప‌టికే ఘాటుగా స్పందించారు. త‌న‌ను అసెంబ్లీకి పిల‌వ‌కుండా త‌న నోటితో టీఆర్ఎస్ రిపోర్ట్ కార్డును చ‌దివించుకునే అవ‌కా‌శాన్ని ఆ పార్టీ నేత‌లు చేజార్చుకున్నార‌ని త‌మిళిసై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. 

తాజాగా అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన రోజున‌నే జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న త‌మిళిసై.. స‌మాజంలో ఇంకా మ‌హిళ‌లకు గౌర‌వం ద‌క్క‌డం లేద‌న్న విష‌యాన్ని ‌బాహాటంగానే చెప్పేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తన‌ను ఎవరూ భయపెట్టలేరని.. తాను దేనికీ భయపడను కూడా అని మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News