టీడీపీకి రెండు పండుగలు.. పార్టీ 40వ వార్షికోత్సవం.. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు!

  • మే 27న ఎన్టీఆర్ జ‌న్మ‌దినం
  • అదే రోజున మొద‌లు కానున్న టీడీపీ మ‌హానాడు
  • ఈ ఏడు కార్య‌క్ర‌మాల కోసం నిర్వ‌హ‌ణ క‌మిటీ ఏర్పాటు
ఏపీలో విప‌క్ష పార్టీగా కొన‌సాగుతున్న తెలుగు దేశం పార్టీకి ఈ ఏడాది చాలా ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చెప్పాలి. ఎందుకంటే.. రెండు భారీ పండుగ‌ల‌ను ఆ పార్టీ జ‌రుపుకోనుంది. ఒక‌టి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి వేడుక‌లు ఈ ఏడాదిలోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకుని త‌న‌దైన శైలి రాజ‌కీయాల‌తో స‌త్తా చాటుతున్న టీడీపీకి ఈ ఏడాది 40 ఏళ్లు నిండ‌నున్నాయి. అంటే.. వ్య‌వ‌స్థాప‌కుడికి 100 ఏళ్లు పూర్తి అయితే.. ఆ వ్య‌వస్థాప‌కుడు ప్రారంభించిన టీడీపీ 40ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంద‌న్న మాట‌.

ఏటా ఎన్టీఆర్ జ‌న్మ‌దినం అయిన మే 27న టీడీపీకి సంబంధించి మ‌హానాడు అనే పెద్ద పండుగ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. మే 27న మొద‌లై 28న ముగియ‌నున్న ఈ వేడుక‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆనందాల్లో మునిగి తేల‌తారు. సాధార‌ణ మ‌హానాడుకే ఓ రేంజి సెల‌బ్రేష‌న్ జ‌రుగుతూ ఉంటే..పార్టీకి 40 ఏళ్లు పూర్తి కావ‌డంతో పాటుగా ఎన్టీఆర్ శత జ‌యంతి ఉత్స‌వం కూడా ఇదే ఏడాదిలో వ‌స్తుండ‌టంతో ఈ ఏటి మ‌హానాడును మ‌రింత గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ఈ వేడుక‌లకు నిర్వ‌హ‌ణ క‌మిటీని నియ‌మిస్తూ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.


More Telugu News