కోహ్లీ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ గా దినేశ్‌?

  • ఆర్సీబీ కెప్టెన్సీ ప‌గ్గాలు వ‌దిలేసిన కింగ్ కోహ్లీ
  • పెళ్లి కార‌ణంగా రేసు నుంచి మ్యాక్స్‌వెల్ ఔట్‌
  • డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ద‌క్కుతుంద‌ని అంచ‌నా
  • దినేశ్ కార్తీక్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు?
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఈ ఏడాది సీజ‌న్‌కు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ ఇప్ప‌టికే విడుద‌లైపోయింది. గ‌తేడాది ఐపీఎల్‌లో ఆడిన జ‌ట్ల‌కు అద‌నంగా ఈ ఏడాది మ‌రో రెండు కొత్త జ‌ట్లు బ‌రిలోకి దిగనున్న సంగ‌తి తెలిసిందే. అన్ని జ‌ట్లు త‌మ కెప్టెన్లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా.. స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ఇప్ప‌టిదాకా త‌న కెప్టెన్ పేరును ప్ర‌క‌టించలేదు. గ‌తేడాది దాకా ఆర్సీబీ కెప్టెన్‌గా కొన‌సాగిన కోహ్లీ ఈ ద‌ఫా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను వ‌దిలేసిన సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో ఆర్సీబీ కెప్టెన్ ఎవ‌రా? అన్న దిశ‌గా ఇప్ప‌టికే లెక్క‌లేన‌న్ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో మాక్స్‌వెల్, డు ప్లెసిస్ పేర్లు నిన్న‌టిదాకా వినిపించగా.. మాక్స్‌వెల్ తన వివాహం కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా దినేష్ కార్తీక్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆర్సీబీ మెనేజ్ మెంట్‌ కార్తీక్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మెగా వేలంలో ఆర్సీబీ కార్తీక్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది.


More Telugu News