ఐఫోన్‌కు పోటీగా 'అయా టీ1'.. ర‌ష్యా సూప‌ర్ ప్లాన్‌

  • పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ర‌ష్యా కొత్త ఫోన్‌
  • ధ‌ర 15 నుంచి 19 రూబుళ్లు ఉండే అవ‌కాశం
  • ఇత‌రుల నిఘాకు చిక్క‌కుండా హార్ట్ వేర్ బ‌ట‌న్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో 'అయా టీ1'
ఉక్రెయిన్‌పై దండెత్తితే ప్ర‌పంచ దేశాలు త‌న‌పై విధించే ఆంక్ష‌లు, వాటి ఫ‌లితంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు, ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏం చేయాల‌న్న విష‌యాల‌పై ర‌ష్యా పూర్తి క్లారిటీ తెచ్చుకున్నాకే.. దాడులు మొద‌లుపెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కార‌ణంగా అమెరికా స‌హా నాటో దేశాలు వివిధ అంశాల‌కు సంబంధించి ఆంక్ష‌లు విధించినా..ర‌ష్యాలో ఇసుమంత భ‌యం కూడా క‌నిపించ‌డం లేదు. 

అదే స‌మ‌యంలో త‌న‌పై ఆంక్ష‌లు విధించ‌డ‌మంటే.. త‌న‌పై యుద్ధానికి దిగిన‌ట్టేన‌ని కూడా బెదిరిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ర‌ష్యా ప్రీప్లాన్ ఏమిట‌న్న‌ దానిపై చ‌ర్చ ఊపందుకుంది. అందులో భాగంగా ఇప్పుడు వెల్ల‌డైన ఓ అంశం ర‌ష్యా ముందు చూపును మన ముందుంచుతోంది. 

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా యాపిల్ స‌హా ప‌లు టెక్నాల‌జీ సంస్థ‌లు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. త‌మ ఉత్ప‌త్తుల‌ను ర‌ష్యాకు పంప‌బోమ‌ని యాపిల్ స‌హా దాదాపుగా అన్ని కంపెనీలు ప్ర‌క‌టించాయి. యాపిల్ త‌యారీ మొబైల్ ఐఫోన్ అంటే..విశ్వ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే క‌దా. మ‌రి ఉన్న‌ట్టుండి యాపిల్ త‌న‌కు ఐఫోన్‌ల‌ను నిలిపేస్తే ఏం చేయాల‌న్న దానిపై ర‌ష్యా ముందుగానే ప్లాన్ చేసుకున్న‌ట్టుగా తాజా వార్త‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఐఫోన్‌కు దీటుగా ప‌నిచేసే స్వ‌దేశీ మొబైల్‌ను వినియోగించాల‌ని ర‌ష్యా త‌న దేశ పౌరుల‌కు పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును 'అయా టీ1'గా ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఈ ఫోన్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోద‌ట‌. 

'అయా టీ1' మొబైల్‌ను ర‌ష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న స్మార్ట్ ఇకో సిస్ట‌మ్ అభివృద్ధి చేసింద‌ట‌. 15 నుంచి 19 వేల రూబుల్స్ విలువ చేసే ఈ ఫోన్ వినియోగ‌దారుల‌పై ఇత‌రులు నిఘా పెట్ట‌లేర‌ట‌. త‌మ‌పై నిఘా పెట్టాల‌నుకునే వ్య‌క్తుల ఫోన్ల మైక్రోఫోన్‌, కెమెరాల‌ను 'అయా టీ1' టర్న్ ఆఫ్ చేసేస్తుంద‌ట‌. ఇందుకోసం ఈ ఫోన్‌లో ఓ స‌రికొత్త హార్డ్ వేర్ బ‌ట‌న్ ను ఏర్పాటు చేస్తార‌ట‌. 

ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే..  మీడియా టెక్ హీలియో పీ70 ప్రాసెస‌ర్‌, 8 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ, 4000 ఎంహెచ్ఏ బ్యాట‌రీల‌తో రానున్న ఈ ఫోన్‌లో 12 ఎంపీ, 5 ఎంపీ డిజిట‌ల్ ఇమేజీ స్టెబిలైజేష‌న్‌తో కూడిన రెండు కెమెరాలు ఉంటాయ‌ట‌. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తో ప‌నిచేస్తుంద‌ని స‌మాచారం.


More Telugu News