ఎగ్జిట్ పోల్స్‌... యూపీ బీజేపీదే, పంజాబ్‌లో ఆప్‌

  • యూపీ పీఠం మ‌ళ్లీ క‌మ‌ల‌నాథుల‌దేన‌ట‌
  • పంజాబ్‌లో ఆప్ జెండా ఎగురుతుంద‌ట‌
  • ఉత్త‌రాఖండ్‌లో కాంగ్రెస్‌కు స్వ‌ల్ప మెజారిటీ
  • మ‌ణిపూర్‌, గోవాలు బీజేపీ ఖాతాలోకేన‌ట‌
దేశంలో ఆస‌క్తి రేకెత్తించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు సోమ‌వారంతో ముగిశాయి. దేశ రాజ‌కీయాల‌ను శాసించేదిగా భావిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీల‌కు విడ‌త‌ల వారీగా జ‌రిగిన ఎన్నిక‌లు సోమ‌వారంతో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం తుది విడ‌త పోలింగ్ ముగిసినంత‌నే ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప‌లు సంస్థ‌లు త‌మ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల‌ను వెల్ల‌డించాయి. 

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల ప్ర‌కారం త‌మ పాల‌న‌లో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోమారు బీజేపీనే జెండా ఎగుర‌వేయ‌నుంద‌ట‌. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో ఉన్న పంజాబ్‌లో ఆ పార్టీ చిత్తు కాగా.. కొత్త‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని మెజారిటీ సంస్థ‌లు వెల్ల‌డించాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికార బీజేపీ క్లియ‌ర్ మెజారిటీతోనే విక్ట‌రీ కొట్ట‌నున్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. అదే స‌మ‌యంలో దూకుడు మీద క‌నిపించిన స‌మాజ్ వాదీ పార్టీ.. బీజేపీకి ద‌క్కే సీట్ల‌లో స‌గం సీట్లు గెలుచుకుంటే గొప్ప అన్న రీతిలో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలున్నాయి. ఇక పంజాబ్ పీఠాన్ని వ‌దిలేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సింగిల్ డిజిట్‌కు ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని ఈ పోల్స్ తేల్చేశాయి.

ఇక ఉత్త‌రాఖండ్‌లో బీజేపీతో పోటాపోటీగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేజిక్కించుకోవడం క‌ష్ట‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక గోవాలోనూ మ‌రోమారు బీజేపీనే గ‌ద్దెనెక్క‌డం ఖాయ‌మంటూ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేస్తున్నాయి. ఇక మ‌ణిపూర్‌లోనూ కాషాయ జెండానే ఎగుర‌నున్న‌ట్లుగా ఈ పోల్స్ చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఒక‌ప్పుడు ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను త‌న‌కు అనుకూలంగా తిప్పేసుకుని చ‌క్రం తిప్పిన బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ ఈ ద‌ఫా అడ్రెస్ గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్న రీతిలో ఎగ్జిట్ పోల్స్ వ‌స్తున్నాయి. యూపీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే క్ర‌మంగా క‌నుమ‌రుగు అయిపోతోందో...అదే మాదిరిగా ఇప్పుడు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితిని ఎదుర్కొంటోందని ఈ పోల్స్ చెబుతున్నాయి.

ఇక మొత్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేయ‌నుండ‌గా.. ఆప్‌ను ఇంకో రాష్ట్రంలో అడుగుపెట్టేలా చేయ‌నున్నాయ‌ట‌. ఉత్త‌రాఖండ్ స్వ‌ల్ప మెజారిటీ వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవ‌కాశాలు దాదాపుగా మృగ్య‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News