ఉక్రెయిన్ లో ఏ రష్యా సాయుధ వాహనంపై చూసినా 'జడ్' అనే అక్షరం... ఎందుకంటే..!

  • ఉక్రెయిన్ లో రష్యా సైనిక చర్య
  • ఉక్రెయిన్ భూభాగంపై భారీ సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు
  • 'జడ్' అక్షరంపై వివరణ ఇచ్చిన స్కాలర్లు
గత 13 రోజులుగా రష్యా బలగాలు ఉక్రెయిన్ లో ప్రవేశించి తీవ్ర విధ్వంసం సృష్టిస్తుండడం తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరిట కొనసాగుతున్న ఈ దాడుల్లో పెద్ద ఎత్తున రష్యా సాయుధ వాహనాలు పాల్గొంటున్నాయి. రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు, సైనిక ట్రక్కులు, శతఘ్నులు, మిస్సైల్ లాంచర్లు ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయితే, ఆ వాహనాలన్నింటిపైనా 'జడ్' (z) అనే అక్షరం కనిపిస్తుంది. రష్యా వాహనాలకు ముందో, వెనుకో, పక్కనో... మొత్తానికి 'జడ్' అనే అక్షరాన్ని పెయింట్ తో రాసి ఉండడాన్ని చూడొచ్చు. 

అయితే 'జడ్' అనే అక్షరం వెనుక రష్యన్ స్ఫూర్తి దాగి ఉందని కొందరు స్కాలర్లు అభిప్రాయపడుతున్నారు. 'జడ్' అనే అక్షరం రష్యన్ భాషలోని 'జా పోబెడీ' అనే నినాదాన్ని సూచిస్తుందని కమిల్ గలీవ్ అనే ఓ స్కాలర్ వెల్లడించారు. 'జా పోబెడీ' అంటే 'విజయం కోసం' అని అర్థమట. కొందరు మాత్రం 'జడ్' అనే అక్షరం 'జపడ్' అనే పదాన్ని సూచిస్తుందని, 'జపడ్' అంటే 'పశ్చిమ' అని అర్థం అని చెబుతున్నారు. 

మొత్తానికి, జడ్ అనే అక్షరం మాత్రం రష్యన్ సైనిక వాహనాలపై తప్పనిసరిగా దర్శనమిస్తోంది. 'జడ్' అనేది రష్యన్ల తాజా భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని, జాతీయ ఐక్యతకు నిదర్శనంలా మారిందని గలీవ్ పేర్కొన్నారు. 'జడ్' అనే అక్షరం రష్యన్ మిలిటరీ వాహనాలపై కనిపించడం ఇదే ప్రథమం కాదు. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పుడు కూడా రష్యా వాహనాలపై ఈ అక్షరం దర్శనమిచ్చింది.


More Telugu News