పెట్టుబడులు, వ్యాపారాలకు కేంద్రంగా ప్రపంచం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది: కల్వకుంట్ల కవిత

  • తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
  • సోషల్ మీడియాలో స్పందించిన కవిత
  • సీఎం కేసీఆర్ దార్శనికతపై ట్వీట్లు
  • పలు అంశాల ప్రస్తావన
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పాలన విధానాలు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సామాజిక ఉన్నతికి చేర్చడంలో కీలకంగా మారుతున్నాయని కితాబునిచ్చారు. ఇవాళ ప్రపంచం అంతా తెలంగాణను పెట్టుబడులకు, వ్యాపారాలకు తగిన కేంద్రంగా చూస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తోందని, స్టార్టప్ లకు అత్యంత అనువైన విధానాలు అందుబాటులో ఉన్నాయని కవిత వివరించారు. 

"సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు రాష్ట్రంలో 8.2 మిలియన్ల మందికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, క్షురకులు, రజకులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు చేయూతగా నిలుస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ ఇతర రాష్ట్రాల బడ్జెట్ ను దాటిపోయింది. 2014-15లో సంక్షేమ పథకాల కేటాయింపులు రూ.15,750 కోట్లు ఉంటే... 2021-22 నాటికి అది రూ.54,054 కోట్లు అయింది. 

తెలంగాణ పట్ల, తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజల పట్ల కేసీఆర్ ప్రేమాభిమానాలు రాష్ట్రాన్ని ఓ నమూనాగా మలిచాయి. దార్శనికత ద్వారా తెలంగాణను స్వయం సమృద్ధి గల రాష్ట్రంగా మార్చే క్రమంలో సీఎం కేసీఆర్ సరైన పంథాను అనుసరించారు. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్లు ఉంటే ఇప్పుడు 2022-23లో అది రూ.2,56,958 కోట్లు అయింది. ఇదీ.. తెలంగాణ అభివృద్ధి గాథ, సీఎం కేసీఆర్ గారి దార్శనికత!" అంటూ కవిత సోషల్ మీడియాలో వివరించారు.


More Telugu News