ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క చ‌ట్టాల‌ స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం

ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క చ‌ట్టాల‌ స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం
  • విదేశీ మ‌ద్యం నియంత్ర‌ణ‌కు స‌వ‌ర‌ణ‌
  • హిందూ ధార్మిక సంస్థ‌ల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఓకే
  • టీటీడీలో ప్ర‌త్యేక ఆహ్వానితుల కోస‌మే ఈ స‌వ‌ర‌ణ‌
  • అధికార భాషా చ‌ట్టం 1966కు కూడా స‌వ‌ర‌ణ‌
  • రాష్ట్రంలో ఉర్దూనే రెండో భాష‌గా గుర్తించేందుకే ఈ స‌వ‌ర‌ణ‌
ఏపీలోని వైసీపీ స‌ర్కారు త‌న‌దైన శైలి దూకుడును కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు కీల‌క అంశాల‌పై సంచలన నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కారు.. తాజాగా మరికొన్ని కీల‌క అంశాల‌కు సంబంధించి సోమ‌వారం నాడు నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాగానే.. బీఏసీ స‌మావేశాన్ని ముగించుకున్న సీఎం జ‌గ‌న్ త‌న కేబినెట్ స‌హ‌చ‌రుల‌తో క‌లిసి భేటీ అయ్యారు. వాస్త‌వానికి ఈ నెల 3న‌నే ఈ కేబినెట్ భేటీ జ‌ర‌గాల్సి ఉన్నా.. ఆ రోజు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి పెద్ద క‌ర్మ ఉండ‌టంతో సోమ‌వారానికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీలో ఏకంగా 35 అంశాల‌తో కూడిన అజెండాపై చ‌ర్చ జ‌రిగింది. ఇందులో భాగంగా ప‌లు కీల‌క అంశాల‌ను ప‌రిశీలించిన ఏపీ ప్ర‌భుత్వం కొన్ని కీల‌క చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కూడా తీర్మానించింది. విదేశీ మ‌ద్యం నియంత్ర‌ణ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయాల‌ని తీర్మానించిన కేబినెట్‌.. టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌కం కోసం ఏకంగా హిందూ ధార్మిక సంస్థ‌ల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయాల‌ని కూడా నిర్ణ‌యించింది. 

ఇప్ప‌టికే టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌కం, వారిలో కొంద‌రు నేర చ‌రితులు వున్నారంటూ ఆరోపణలు రావడం ఏపీలో పెను వివాద‌మే రేగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఆహ్వానితుల కోసం ఏకంగా హిందూ ధార్మిక సంస్థ‌ల చ‌ట్టానికే స‌వ‌ర‌ణ చేయాల‌ని నిర్ణయించడం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఉర్దూ భాష‌ను రెండో భాష‌గా గుర్తించే దిశ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం.. అందుకోసం ఏపీ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణ చేయాల‌ని కూడా నిర్ణయించింది. వీటితో పాటు నిజాంప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, ఉప్పాల ఫిషింగ్ హార్బ‌ర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన కేబినెట్‌.. మ‌చిలీప‌ట్నం, భావ‌న‌పాడు, రామాయ‌ప‌ట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741కోట్ల రుణ స‌మీక‌ర‌ణ‌కు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకూ అంగీక‌రించింది. మ‌డ‌క‌శిర బ్రాంచ్ కెనాల్ ప‌నుల‌కు రూ.214 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 


More Telugu News