ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతాం: గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ బీజేపీ ఎమ్మెల్యేలు

  • కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదు 
  • మేము మాట్లాడ‌కుండా అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారు
  • మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న ఎమ్మెల్యేలు 
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద వారు ముగ్గురు అమరవీరులకు నివాళులర్పించి, అసెంబ్లీకి వెళ్లారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ... గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ ప్రారంభించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. 50 ఏళ్ల నుంచి వస్తున్న విధానాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోన్న‌ కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని అన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఈట‌ల మాట్లాడుతూ.. తాము మాట్లాడ‌కుండా అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమర్శించారు. సీఎం కాక‌ముందు గతంలో కేసీఆర్ గంటల తరబడి మాట్లాడారని, సీఎం అయ్యాక‌ ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా త‌మవైపే ఉన్నారని ఆయ‌న చెప్పారు. తాము అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్ర‌శ్నిస్తామ‌ని తెలిపారు. ఒక‌వేళ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ప్రజలతో కలిసి పోరాడతామ‌ని ఆయ‌న అన్నారు. 



More Telugu News