మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాకే తదుపరి అడుగు: మల్లాది విష్ణు

  • విజయవాడలో రేపు మహిళా సదస్సు
  • హాజరు కానున్న మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు తదితరులు
  • ఏపీ రాజధాని విషయంలో త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న విష్ణు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించినప్పటికీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో నిర్వహించనున్న మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో నిన్న విలేకరుల సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. సదస్సు వివరాలను వెల్లడించారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ సదస్సులో సీఎం వివరిస్తారని తెలిపారు. 

ఈ సదస్సులో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతే ఏపీ రాజధాని అన్న హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల అంశానికే కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఆయన విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీకి రానని ప్రతినబూనిన చంద్రబాబు ఇప్పుడు తమ సభ్యులను ఎందుకు పంపిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News