ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అసలు కారణం అదే.. సంచలన విషయాలు వెల్లడించిన రష్యన్ మీడియా!

  • 1994లో అణ్వాయుధాలను వదులుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటన
  • రష్యాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ తయారీకి సన్నాహాలు
  • యురేనియం సేకరణకు భూమి లోతుల వరకు తవ్వుతున్న ఉక్రెయిన్
  • అగ్గిమీద గుగ్గిలమైన పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఎందుకు ప్రకటించింది? బాంబులు, క్షిపణులతో నగరాలను ఎందుకు ధ్వంసం చేస్తోంది. వేలాదిమంది ప్రాణాలను ఎందుకు హరిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసింది. ఈ మేరకు రష్యన్ మీడియాలో ప్రచురితమైన కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పొరుగుదేశమైన రష్యాతో ఉద్రిక్తతలు పెరిగిన వెంటనే ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు అణ్వాయుధాల తయారీని ఉక్రెయిన్ ప్రారంభించిందని, చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఆ పని ప్రారంభించినట్టు రష్యా ప్రభుత్వ ప్రతినిధిని ఉటంకిస్తూ టీఏఎస్ఎస్, ఆర్ఐఏ, ఇంటర్‌ఫాక్స్ తమ కథనాల్లో పేర్కొన్నాయి.

నిజానికి అణ్వాయుధాలను వదులుకుంటున్నట్టు 1994లోనే ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ తిరిగి అణ్వాయుధాల తయారీని ప్రారంభించినట్టు తెలియడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉక్రెయిన్ తిరిగి అణ్వాయుధాలను సమకూర్చుకోవడమంటే రష్యాపై యుద్ధం ప్రకటించడమేనని పుతిన్ అన్నట్టు మీడియా పేర్కొంది. అంతేకాదు, అణ్వాయుధాల తయారీకి రష్యా అణు పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చూసిందని కూడా పుతిన్ ఆరోపించినట్టు తెలిపింది. 

ఉక్రెయిన్ తయారుచేయబోయే అణ్వాయుధానికి ‘డర్టీబాంబ్’ అని పేరు కూడా పెట్టిందని వివరించింది. దీని తయారీకి అవసరమైన యురేనియం సేకరణకు దిగిన ఉక్రెయిన్ ప్రభుత్వం యురేనియం గనుల్లో మరింత లోతుకు తవ్వకాలు చేపట్టిందని రష్యన్ మీడియా తన కథనాల్లో వివరించింది. మొత్తంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడానికి ప్రధాన కారణం ఇదేనని తెలిపింది.


More Telugu News