మహిళల వరల్డ్​ కప్​.. పాకిస్థాన్​ పై భారత్ ఘన విజయం

  • 107 పరుగులతో పాక్ పై భారత్ ఘన విజయం
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
  • 137 పరుగులకే కుప్పకూలిన పాక్
  • 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల
భారత్ చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బతిన్నది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో బొక్కా బోర్లా పడింది. భారత అమ్మాయిలు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 107 పరుగుల తేడాతో భారత్ మీద ఓడిపోయింది. తొలి మ్యాచ్ లోనే భారత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి అగ్రస్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ విషయంలోనూ మెరుగ్గా ఉంది. 

న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగన్యూలో ఉన్న బే ఓవల్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత భారత మహిళల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు 4 పరుగుల వద్ద మూడో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ షెఫాలి వర్మ.. డయానా బెయిగ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి డకౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంథాన ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 

92 పరుగులు జోడించాక దీప్తి శర్మ (40) వికెట్ సమర్పించుకుంది. ఆ తర్వాత వెనువెంటనే స్మృతి మంథాన (52) కూడా ఔటైంది. ఈ క్రమంలోనే 18 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఇంతటి కష్టంలో బ్యాటింగ్ కు దిగిన స్నేహా రాణా (53), పూజా వస్త్రాకర్ (67)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించేలా చూశారు. దీంతో 50 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. 

245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ను ఓపెనర్ సిద్ర అమీన్ తప్ప ఎవరూ ఆదుకోలేదు. ఆమె ఒక్కతే 30 పరుగులు చేసింది. అయినా కూడా ఆమె వేగంగా ఆడలేకపోయింది. దాంతో పాటు భారత బౌలర్లు క్రమం తప్పకుండా పాకిస్థాన్ వికెట్లు పడగొట్టి 137 పరుగులకే పరిమితం చేశారు. 43 ఓవర్లలోనే పాకిస్థాన్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ గెలుపు ఖాయమైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసింది. స్నేహ రాణా, ఝులన్ గోస్వామిలు తలో రెండు వికెట్లు కూల్చారు. మేఘనా సింగ్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ సాధించారు.    

బ్యాటింగ్ లో 8 ఫోర్ల సాయంతో 59 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పూజా వస్త్రాకర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


More Telugu News