శ్రీలంక వెన్ను వెరిచిన రవీంద్ర జడేజా.. 174కు ఆలౌట్

  • 5 వికెట్లు తీసిన జడేజా
  • బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ లోనూ మెరుపులు
  • 400 పరుగుల ఆధిక్యం
  • వెంటనే రెండో ఇన్నింగ్స్ ఆడనున్న శ్రీలంక
రవీంద్ర జడేజా బౌలింగ్ తోనూ శ్రీలంక జట్టు పని పట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 174 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ముప్పును ఆహ్వానించింది. ఫలితంగా భారత్ 400 పరుగుల భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. 

మొదటి ఇన్నింగ్స్ ను భారత జట్టు రెండో రోజు అయిన శనివారం 574/8 వద్ద డిక్లేర్ చేయడం తెలిసిందే. జడేజా బ్యాట్ తో చెలరేగి 175 పరుగుల భారీ స్కోరుతో భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక తొలి రోజు నాలుగు వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. ఆదివారం మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను జడేజా చావు దెబ్బతీశాడు. 

తన స్పిన్ మాయాజాలంతో లంక వికెట్లను వేగంగా పడగొట్టాడు. మొత్తం 13 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా కేవలం 41 పరుగులు ఇచ్చి 5 వికెట్లు (ఇందులో తొలిరోజు ఒక వికెట్) తీశాడు. రవిచంద్ర అశ్విన్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, షమీ ఖాతాలో ఒక వికెట్ పడింది. దీంతో భారత్ 400 పరుగుల ఆధిక్యం సాధించింది. ఫాలోఆన్ ఆప్షన్ వినియోగించుకోవాలని భారత జట్టు నిర్ణయించింది. ఫలితంగా శ్రీలంక వెంటనే రెండో ఇన్నింగ్స్ ను ఆడాల్సి ఉంటుంది. ఇదే విధంగా పిచ్ సహకరిస్తే శ్రీలంక ఓటమి ఖాయమేనని తెలుస్తోంది.


More Telugu News