జడేజా డబుల్ సెంచరీ రికార్డును అడ్డుకున్నదెవరు? 

  • శ్రీలకంతో మొదటి టెస్ట్ లో జడేజా 175 పరుగులు
  • ఆ సమయంలోనే మొదటి ఇన్నింగ్స్ 574/8 వద్ద డిక్లేర్
  • డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నట్టు రోహిత్ పై విమర్శలు
  • తానే డిక్లేర్ చేయమన్నానంటూ జడేజా ప్రకటన
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూప ప్రదర్శనతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ను 574/8 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. ఆ సమయానికి రవీంద్ర జడేజా 175 స్కోరుతో నాటౌట్ గా ఉన్నాడు. అప్పటికే ఏడో స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సాధించేశాడు. మరో 4-5 ఓవర్లు ఓపిక పడితే మంచి ఊపు మీదున్న జడేజా ద్వితీయ శతకాన్ని పూర్తి చేసుకునే వాడు. 

కానీ, ఆ సమయంలో భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పట్ల అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. జడేజా డబుల్ సెంచరీ రికార్డు సాధించకుండా కావాలనే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు సామాజిక మాధ్యమాలపై పోస్ట్ లు పడ్డాయి. కాదు, కాదు దీని వెనుక కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు ఉన్నాయంటూ నెటిజన్లు అతడిపైనా విరుచుకుపడ్డారు. మొత్తం మీద భారత్ ఇన్నింగ్ డిక్లేర్ చేసిన సమయం, సందర్భం వెనుక రాజకీయాలు ఉన్నాయన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. జడేజా రెండో సెంచరీ పూర్తయ్యే వరకు ఆగి ఉంటే బావుండేదన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వ్యక్తమైంది.

కానీ, ఈ విమర్శలకు రవీంద్ర జడేజాయే పుల్ స్టాప్ పెట్టేశాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలంటూ తానే స్వయంగా కెప్టెన్ కు సందేశాలు పంపానని ప్రకటించాడు. ‘‘పిచ్ పై బంతి అస్థిరంగా బౌన్స్ అవుతోంది. డెలివరీలు తిరగడం మొదలైంది. పిచ్ సహకరించడం మొదలు కావడంతో వెంటనే ప్రత్యర్థిని బ్యాటింగ్ కు దింపాలని సూచించాను. తద్వారా ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల అలసటను (అప్పటి వరకు ఫీల్డింగ్ చేసినందున) సొమ్ము చేసుకోవాలని అనుకున్నాం’’అని జడేజా వివరించాడు. అంటే తన రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని జడేజా చాటాడు.


More Telugu News