రేపు భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్న తెలంగాణ స‌ర్కారు

  • సంక్షేమ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట 
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జాక‌ర్ష‌క బ‌డ్జెట్
  • ద‌ళిత బంధుకు అధిక నిధులు?
రేపు భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డానికి తెలంగాణ స‌ర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ సారి సంక్షేమ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్న‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌రులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌డం, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కూడా టీఆర్ఎస్ సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఈ బ‌డ్జెట్ లో ప్రజాక‌ర్ష‌ణ ప‌థ‌కాల‌కు అధిక నిధులు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

తెలంగాణ‌లో పెరిగిన ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని బ‌డ్జెట్‌ను గ‌త ఏడాది కంటే పెంచ‌నున్న‌ట్లు స‌మాచారం. వార్షిక బడ్జెట్‌ను మంత్రి హ‌రీశ్ రావు రేపు శాసనసభలో ప్ర‌వేశ‌పెడ‌తారు. ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. 

ఈ బడ్జెట్‌లో దళిత బంధు పథకానికి అధికంగా నిధులు కేటాయించనున్నారు. అలాగే, తెలంగాణ‌లో అమ‌లవుతున్న‌ ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, వడ్డీ లేని రుణాలు, డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వంటి వాటికి కేటాయింపులు భారీగా పెరగనున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సేక‌రించి కేటాయింపులపై స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చింది. గ‌వర్నర్ త‌మిళిసై ప్ర‌సంగం లేకుండానే ఈ సారి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.


More Telugu News