చివరి విద్యార్థి కదిలే వరకు ఇక్కడే ఉంటా.. ఉక్రెయిన్ లో భారత డాక్టర్ సాహసోపేత నిర్ణయం

  • కీవ్ లో స్టూడెంట్ కన్సల్టెంట్ గా సేవలు
  • భారత విద్యార్థుల తరలింపునకు సాయం
  • ఖర్కీవ్ లో మరో 2,000 మంది ఉన్నారన్న డాక్టర్
ఉక్రెయిన్ లో ఓ యువ వైద్యుడు భారతీయ విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. ఆయన పేరే 37 ఏళ్ల పృథ్వీరాజ్ ఘోష్. కోల్ కతాకు చెందిన ఆయన ఉక్రెయిన్ లో డాక్టర్, స్టూడెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. భారత విద్యార్థుల తరలింపులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 

‘‘నేను కీవ్ లో చిక్కుకుపోలేదు. నా అంతట నేను విడిచిపెట్టి పోను. ఉక్రెయిన్  నుంచి 350 మంది భారత విద్యార్థుల తరలింపులో స్వయంగా పాల్గొన్నాను. వారంతా నా విద్యార్థులు. ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయిన ఇతర కోఆర్డినేటర్లు.. సుమీ సహా ఉక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులకు సాయపడాలని నన్ను కోరారు’’ అని ఘోష్ తెలిపారు. 

కాల్పుల విరమణ అన్నది స్థానిక పౌరుల కోసమే కానీ, భారత విద్యార్థులకు కాదని ఘోష్ చెప్పారు. ఖర్కీవ్ నుంచి 2,000 మంది విద్యార్థులు తరలి పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు పృథ్వీరాజ్ తల్లిదండ్రులు బ్రతాతి, ప్రదీప్ ఘోష్ తమ కుమారుడు క్షేమంగా భారత్ కు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. 



More Telugu News