ప్రధానమంత్రి మోదీ లక్ష్యం ఏమిటో చెప్పిన ఉండవల్లి

  • దేశంలో మళ్లీ బ్రిటిష్ రోజులు రాబోతున్నాయి
  • దేశం నుంచి మధ్యతరగతి అవుట్
  • ప్రతిపక్షాలు బలహీనపడితే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. దేశంలో మళ్లీ బ్రిటిష్ రోజులు రాబోతున్నాయని అన్నారు. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్య మైదానంలో ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిన్న ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ తీరుతో దేశంలో ఇకపై మిగిలేది డబ్బున్నవాడు, పేదవాడేనని, మధ్యతరగతి అనేదే ఉండదని అన్నారు. 

ప్రతిపక్షాలు బలహీనపడితే దేశంతో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ మోదీని కాదనలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. ప్రజలంతా ఒక్కటై ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయం ఉంటే ఏ పార్టీ అయినా భయపడుతుందని కానీ దేశంలో ఎక్కడా ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ఇదే సభకు హాజరైన ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశం కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.


More Telugu News