ఉక్రెయిన్ తన సొంత ప్రతినిధినే కాల్చి చంపింది: రష్యా తీవ్ర ఆరోపణలు

  • రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండు దఫాలు చర్చలు
  • తొలి విడత చర్చల్లో పాల్గొన్న డెనిస్ కిరీవ్
  • రష్యాకు సమాచారం లీక్ చేశాడంటూ ఆరోపణలు
  • అరెస్ట్ చేసే ప్రయత్నంలో హతమార్చిన ఉక్రెయిన్ బలగాలు
ఉక్రెయిన్ తో మూడో విడత చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు జరిగిన చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధిగా విచ్చేసిన డెనిస్ కిరీవ్ ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కాల్చి చంపిందని రష్యా పేర్కొంది. రష్యాకు సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలతో డెనిస్ కిరీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో కిరీవ్ మరణించాడని రష్యా వర్గాలు వివరించాయి. కిరీవ్ పై దేశద్రోహ నేరం మోపారని వెల్లడించాయి. 

ఈ ఘటనను కీవ్ ఇండిపెండెంట్ మీడియా సంస్థ కూడా నిర్ధారించింది. ఉక్రెయిన్ తరఫున చర్చల్లో పాల్గొన్న బృందంలో ఓ వ్యక్తిని ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ చంపేసిందని పేర్కొంది. ఆ వ్యక్తి రష్యాకు సమాచారం లీక్ చేశాడన్న దానికి బలమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు జరిగిన సమయంలో డెనిస్ కిరీవ్ చివరిసారిగా దర్శనమిచ్చాడు. అయితే, అతడిని సెక్యూరిటీ దళాలు కాల్చి చంపాయన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.


More Telugu News