అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేసేలా రష్యాను జెలెన్ స్కీనే రెచ్చగొట్టాడు: ఉక్రెయిన్ మాజీ ప్రధాని ఆరోపణ

  • జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం
  • రష్యా దాడులతో యూరప్ దేశాల్లో కలవరం
  • జెలెన్ స్కీ పక్కా ప్రణాళికతో రెచ్చగొట్టాడన్న అజరోవ్
  • నో ఫ్లై జోన్ ప్రకటన కోసమేనని ఆరోపణ
యుద్ధ సమయంలోనూ ఉక్రెయిన్ లో ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తోంది. జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేయడానికి అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీనే కారణమని ఉక్రెయిన్ మాజీ ప్రధాని మికోలా అజరోవ్ ఆరోపించారు. జెలెన్ స్కీ రెచ్చగొట్టడం వల్లే అణు విద్యుత్ ప్లాంటును రష్యా లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. ఉక్రెయిన్ ను నో ఫ్లై జోన్ గా ప్రకటించే విషయంలో పాశ్చాత్య దేశాలను ఒప్పించేందుకు జెలెన్ స్కీ కవ్వింపు ధోరణిలో వెళుతున్నారని అజరోవ్ పేర్కొన్నారు. 

కాగా, జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియో ధార్మికతను వ్యాపింపజేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్ వర్గాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని నిన్న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. జపోర్జియా అణు విద్యుత్ కేంద్రం వద్ద పెట్రోలింగ్ కు వెళ్లిన రష్యన్ బలగాలకు అక్కడ ఉక్రెయిన్ దళాల నుంచి కాల్పులతో స్వాగతం లభించింది. దాంతో రష్యన్ సైనికులు కూడా తమ తుపాకులకు పనిచెప్పడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. 

దీనిపై ఉక్రెయిన్ మాజీ ప్రధాని మికోలా అజరెవ్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యే అయినా ఇది ఎంతో సున్నితమైన వ్యవహారమని, రష్యన్ సైనికులు గానీ, ఉక్రెయిన్ సైనికులు గానీ కాల్పులు జరిపేందుకు తెగించరాదని హితవు పలికారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో, ఆరు రియాక్టర్లున్న యూరప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం వద్ద పరస్పర దాడులకు దిగడం సమంజసం కాదని అన్నారు. ఇలాంటి సూపర్ కేటగిరీ అణు కర్మాగారాల వద్ద తేలికపాటి కాల్పుల ఘటనలు కూడా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తాయని అజరోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

అణు విద్యుత్ కేంద్రం విషయంలో జెలెన్ స్కీ అమెరికా, బ్రిటన్ లను ఉద్దేశించి పంపిన సందేశం పూర్తిగా తప్పు అని ఖండించారు. ఓ ప్రణాళికతోనే కవ్వింపులకు పాల్పడ్డారన్న విషయాన్ని ఇది చాటుతోందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ను ఎలాగైనా నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చేసేందుకే జెలెన్ స్కీ రెచ్చగొట్టే వ్యాఖ్యల ఎత్తుగడకు పాల్పడ్డారని ఆరోపించారు.


More Telugu News